*గాడిద... గాడిదే! -- చందమామ కథలు*
*జీవన్‌సింగ్ అనే వ్యాపారి తన దుకాణానికి కావలసిన సరుకులను కొనడానికి తరచూ దాపులనున్న పట్టణానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళేప్పుడు తన గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఒకనాడలా వెళ్ళి, పట్టణంలో సరుకులు కొనుక్కుని తిరుగు ప్రయూణమయ్యేసరికి బాగా అలిసిపోవడంతో, విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో నడుం వాల్చాడు. కొంతసేపటికి అలాగే మగత నిద్రలోకి జారుకున్నాడు.*
*ఉన్నట్టుండి చిన్న పిల్లలు ముక్తకంఠంతో పాఠాలు వల్లెవేయడం చెవిని పడడంతో జీవన్ సింగ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, చుట్టుపక్కల కలయచూశాడు. పక్కనే ఉన్న ఇంట్లో ముల్లా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడని గ్రహించాడు. ‘‘నేనెందుకిలా గొంతుచించు కుని అరుస్తున్నానో తెలుసా? మీరందరూ గాడిదలు. మిమ్మల్ని మనుషులుగా తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తున్నాను.*
*మీరేమో నా మాటలేవీ పట్టించుకోకూడదని శపథం చేసిన వాళ్ళలా కూర్చున్నారు!'' అని ముల్లా కేకలు పెట్టడం ఆయన విన్నాడు. ఆ తరవాత పిల్లలు మౌనంగా ఇంటినుంచి వెళ్ళిపోవడం జీవన్‌సింగ్ గమనించాడు. అప్పుడాయనకు తన బాల్యం ఒకసారి కళ్ళ ముందు కదలాడింది. తనెప్పుడూ బడికి వెళ్ళిన పాపాన పోలేదు. తండ్రి దుకాణమే అతని బడి. మాట్లాడడం, చదవడం, రాయడం లెక్కలు వేయడం నేర్చుకున్నదంతా అక్కడే.*
*అన్నిటికీ మించి దుకాణానికి వచ్చేవారితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను తండ్రి ప్రత్యక్షంగా అక్కడే నేర్పాడు. ముల్లా మాటలు వినగానే, ‘‘ఆహా, గాడిదలను మనుషులుగా మార్చడానికి ప్రయత్నించే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈ విషయం తనకు తెలియకపోయిందే!'' అని భావించాడు.*
*బరువులు మోయడానికి తప్ప మరిదేనికీ పనికిరాని గాడిద తన దగ్గర ఉన్నది. ఆ పని చేయడానికి గాడిదకు ఎలాంటి తెలివితేటలూ అవసరం లేదు కదా మరి. జీవన్‌సింగ్ లేచి గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళి, ముల్లాకు సలాం చేసి, తన గాడిదను మనిషిగా మార్చమని వేడుకున్నాడు. ముల్లా అతని కేసి ఆశ్చర్యంగా చూశాడు. చెట్టుకింద పడుకుని తాను విన్నదంతా వివరించిన జీవన్ సింగ్ మాటలు విని ముల్లా గట్టిగా నవ్వాడు.*
*ఆ తరవాత అతనికి ఆశాభంగం కలిగించడం దేనికని, ‘‘సరే, నీ గాడిదను ఇక్కడే వదిలి, దానిని మూడు నెలల పాటు మేపడానికి అయ్యేఖర్చును కూడా ఇచ్చి వెళ్ళు. ఆ తర వాత వచ్చి చూడు,'' అన్నాడు. జీవన్‌సింగ్ చాలా సంతోషించాడు. సరుకులు కొనగా మిగిలివున్న డబ్బును ముల్లాకు ఇచ్చాడు. గాడిద మీద వేసిన సరుకులను తీసి భుజానికి తగిలించుకున్నాడు. గాడిదను ముల్లాకు అప్పగించి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.*
*మూడు నెలల పాటు ఉచితంగా బరువులు మోయించడానికి చక్కటి గాడిద వెతుక్కుంటూ వచ్చి నందుకు ముల్లా సంతోషించాడు. పైగా దాని మేతకు తను దమ్మిడీ ఖర్చుపెట్టనవసరం లేదు. మూడు నెలలు ఇట్టే గడిచి పోయాయి. తన గాడిద బలమైన యువకుడి రూపంలో కాచుకుని వుంటుందన్న గంపెడాశతో జీవన్ సింగ్ ముల్లా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే ముల్లా నవ్వుతూ ‘‘రండి, రండి. నేను అనుకున్న దానికన్నా గాడిద చాలా తెలివైనది.*
*ఒక నీతిగ్రంథంలో రెండు గీతాలు వల్లించడం ఆరంభించగానే మెల్ల మెల్లగా అందమైన యువకుడిగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పక్క ఊరి అధికారి మరణించాడు. ఆ ఊరి పెద్దలు సమర్థుడైన అధికారి కోసం వెతుకుతూ సలహా కోసం నా దగ్గరికి వచ్చారు.*
*నేను యువకుడిగా మారిన గాడిదను చూపాను. గ్రామపెద్దలు నాకు కృతజ్ఞతలు చెప్పి, ఆ యువకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళారు,'' అన్నాడు. ఆ మాట విని జీవన్‌సింగ్ మొదట పరమానందం చెందాడు. వెంటనే తనకు గాడిద లేకపోవడం గుర్తుకు రావడంతో కాస్త బాధ పడ్డాడు.*
*అయినా, అంతటి తెలివైన యువకుడు తనతో వుంటే వ్యాపారంలో తనకు ఎంతో సహాయకారిగా ఉండగలడని ఆలోచించాడు. ఆ యువకుణ్ణి కలుసుకోవాలని నిర్ణయించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి అధికారి ఇంటిని సమీ పించాడు. అప్పుడు అధికారి గ్రామ పెద్దలతో ఏదో చర్చలు జరుపుతున్నాడు. ముల్లా చెప్పినట్టు అధికారి అందంగానూ లేడు; యువకుడు కూడా కాడు.*
*అయితే, సమస్యలను పరిష్కరించడంలో అతని నేర్పును చూస్తే చాలా తెలివైనవాడిలాగే కనిపించాడతనికి. సమావేశం ముగిశాక జీవన్‌సింగ్ వెళ్ళి అధికారిని పలకరించి, ‘‘నేను గుర్తులేనా? నీ యజమానిని. జ్ఞాని అయిన ముల్లా దగ్గర నిన్ను మూడు నెలల క్రితం వదిలి వెళ్ళాను,'' అన్నాడు. అదృష్టవశాత్తు, జీవన్‌సింగ్ మాట తీరుకు అధికారి ఆగ్రహం చెందకుండా, ‘‘అయ్యా నేనీ గ్రామాధికారిని.*
*నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వెలా నాకు యజమానివిగా ఉండేవాడివో తెలియడం లేదు,'' అన్నాడు నెమ్మదిగా. జీవన్‌సింగ్ మూడు నెలల క్రితం జరిగిన దానినీ, ఈ ఉదయం ముల్లాను చూసిన విషయమూ పూస గుచ్చినట్టు వివరించాడు. తనను అతని గాడిదగా భావిస్తూన్న వ్యాపారి వెర్రి బాగుల మనస్తత్వాన్ని చూసి గ్రామాధి కారి మనసులోనే నవ్వుకుని, అతన్ని మరింత ఆటపట్టించాలని, అతని చేతులు పట్టుకుంటూ, ‘‘మిత్రమా, ముల్లా నీ గాడిదను ఇక్కడికి అధికారిగా పంపాడని పొరబాటున చెప్పాడు.*
*నిజానికి అది ఇప్పుడు వివిధ మతాల ముఠాలకునాయకత్వం వహిస్తున్న ఫకీరుగా ఉంటోంది. నువ్వెళ్ళి ఆయనను చూడవచ్చు,'' అన్నాడు. జీవన్‌సింగ్ ఫకీరును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఫకీరు నదీ తీరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్తికాగానే జీవన్‌సింగ్ ఆయన్ను సమీపించి, ‘‘పక్క పట్టణంలో వున్న ముల్లా నీకు జ్ఞాపకం లేడా? ఆయనే నీకు నీతిగ్రంథం నుంచి పద్యాలు బోధించి నిన్ను మనిషిగా మార్చాడు.*
*అంతకు పూర్వం నువ్వు నా గాడిదవు. నేను నీ యజమానిని,'' అన్నాడు. ‘‘నేను గాడిదనా? ఏం చెబుతున్నావు?'' అని నిరసనగా చూసిన ఫకీరు, ‘‘ముల్లా ఎవర్నీ నేను ఎరుగను. మదరసా నుంచి నీతిగ్రంథం పద్యాలు నేర్చుకున్నాను. నువ్వేదో మతిచెడి భ్రమలో ఉన్నావనుకుంటున్నాను.*
*దాన్ని మాయమంత్రాలతో పోగొట్టగలను. అయితే, అంతకు ముందు నువ్వు నీ గాడిదను గురించి వివరంగా చెప్పాలి,'' అన్నాడు. జీవన్‌సింగ్ తన గాడిదను గురించిన వివరాలను పొల్లు పోకుండా వివరించాడు. ఫకీరు చెబుతున్న మాయా మంత్రాలు తన మీద పని చేయవనీ, ఆఖరికి ఫకీరే తన పాత గాడిదగా మారిపోగలడనీ, గాడిద తనను యజమానిగా గుర్తించగలదనీ జీవన్‌సింగ్ లోలోపల ఆశతో ఊహించుకోసాగాడు.*
*అంతా విన్న ఫకీరు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. జీవన్‌సింగ్ కూడా ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఊపిరి బిగపట్టుకుని ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. ఫకీరు కొంతసేపయ్యాక మెల్లగా కళ్ళు తెరిచి, ‘‘నాయనా, మనలో ఎవరైనా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తే వారిని సింహం అంటాం. కుతంత్రంతో కూడిన తెలివి తేటలు గలవాణ్ణి నక్క అంటాం. అయితే, ధైర్యశాలి సింహం కాదనీ, జిత్తులమారి వాడు నక్క కాదనీ మనకు తెలుసు.*
*అయితే, మన భావాలను అలా ప్రకటిస్తాం. ఎదుటి వారికి అది సులభంగా అర్థమవుతుంది. అదే విధంగా తను బోధించే పాఠాలను పిల్లలు, శ్రద్ధగా వినడం లేదని ముల్లా వారిని గాడిదలని మందలించాడు. ఆ ‘పిల్ల గాడిదల్ని' తెలివి తేటలు గల మనుషులుగా మారుస్తానని చెప్పాడు. అందులో ముల్లా తప్పేమీ లేదు. నీ గాడిదను మనిషిగా మార్చమని నువ్వు అడగడం నీ అమాయకత్వం.*
*ముల్లా దగ్గరికి వెళ్ళి చూడు. అతని పెరట్లో నీ గాడిద కనిపిస్తుంది," అన్నాడు. ‘‘చాలా కృతజ్ఞతలు, స్వామీ," అంటూ లేచి నిలబడిన జీవన్‌సింగ్, ‘‘నా జీవితంలో తొలిసారిగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను.*
*నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ముల్లా దగ్గరికి వెళ్ళి నా గాడిదను వెనక్కు తీసేసుకుంటాను," అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఫకీరు చెప్పినట్టే, ముల్లా ఇంటి వెనక పెరట్లో గాడిద కనిపించింది. ముల్లా జాడ లేదు. గుంజకు కట్టివున్న తన గాడిదను విడిపించుకుని, జీవన్‌సింగ్ గ్రామంకేసి తిరుగు ప్రయాణమయ్యాడు.*