సాధనమున పనులు సమకూరు ధరలోన


సాధనమున పనులు సమకూరు ధరలోన
 

 ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే 

👉 "నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు" అని ప్రకటించాడు.


రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, *వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు*. 


రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.

రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు. 


కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.


మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావూ" అని అడగ్గా...

దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు. 

ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా. 

అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.

తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.


👉కబట్టి మిత్రులారా...... 

ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి."సాధనమున పనులు  సమకూరు ధరలోన"


Post a Comment

Previous Post Next Post